Prabhu Natarajan: కేరళ యువకుడ్ని విశిష్ట పురస్కారంతో గౌరవించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
- గతేడాది కుటుంబంతో కలిసి యూకే వెళ్లిన నటరాజన్
- కొన్నిరోజులకే లాక్ డౌన్ ప్రకటన
- ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం
- అయినప్పటికీ సేవామార్గంలో పయనం
- వందల మంది ఆకలి తీర్చిన నటరాజన్
కరోనా కష్టకాలంలో విశిష్ట సేవలందించిన ఓ కేరళ యువకుడికి బ్రిటన్ లో సముచిత గౌరవం దక్కింది. ఆ యువకుడి పేరు ప్రభు నటరాజన్ (34). అతడిని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం యూకే పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుతో సత్కరించింది. గతేడాది కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలోనే నటరాజన్ కుటుంబంతో కలిసి బ్రిటన్ తరలివెళ్లాడు. నటరాజన్ కుటుంబం యూకేలో అడుగుపెట్టిన కొన్నిరోజులకే లాక్ డౌన్ ప్రకటించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నటరాజన్ కు ఈ పరిణామం అడ్డంకిగా మారింది.
అయితే, అతడిలోని సేవాగుణం మాత్రం లాక్ డౌన్ వేళ మరింత పరిమళించింది. భార్య, కుమారుడితో కలిసి వందలమంది నిర్భాగ్యులకు ఆహారం అందించాడు. పీఎం బోరిస్ జాన్సన్ కార్యాలయం గణాంకాల ప్రకారం... నటరాజన్ 11 వేల చాక్లెట్లు, ఇతర ఆహార పదార్థాలను పంపిణీ చేశాడు. తాము నివాసం ఉంటున్న పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రజల ఆకలి తీర్చాడు. అంతేకాదు, ఓ ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఇతర దాతల నుంచి ఆహారం సేకరించి, అన్నార్తులకు అందించాడు.
నటరాజన్ సేవలను గుర్తించిన బ్రిటీష్ ప్రభుత్వం అవార్డుతో గౌరవించింది. కాగా, కరోనా మహమ్మారి నటరాజన్ జీవితంలోనూ విషాదం నింపింది. గత 22 రోజుల వ్యవధిలో భారత్ లో నటరాజన్ తండ్రితో పాటు మరో 11 మంది బంధువులు, 9 మంది సన్నిహితులు కరోనాకు బలయ్యారు. కరోనాతో మృతిచెందిన తనవారికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్టు నటరాజన్ తెలిపాడు. తనకు అవార్డు రావడం పట్ల స్పందిస్తూ, ఈ ఘనత తనొక్కడిదే కాదని, ఇది సమష్టి కృషి అని వినమ్రంగా పేర్కొన్నాడు.