CEC: వచ్చే ఏడాదితో ముగియనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీల గడువు... ఎన్నికలకు సిద్ధమేనన్న సీఈసీ

CEC opines on five states elections in next year
  • 2022లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
  • యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ లో ఎన్నికలు
  • బీహార్, బెంగాల్ ఎన్నికలతో అనుభవం వచ్చిందన్న సీఈసీ
  • మరింత మెరుగైన స్థితిలో ఎన్నికలు జరుపుతామని ధీమా
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీలకు 2022తో గడువు ముగియనుంది. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఎన్నికలకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర మాట్లాడుతూ, కరోనా వ్యాప్తిలో ఉన్న సమయంలోనూ పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి, తగిన అనుభవాన్ని సంపాదించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, త్వరలోనే కరోనా వ్యాప్తి ముగిసిపోతుందని భావిస్తున్నామని వెల్లడించారు. తద్వారా వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

సీఈసీ వ్యాఖ్యలు అటుంచితే... ఇటీవల పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి ఈ ఎన్నికలు కూడా ఓ కారణమని నిపుణులు ఆరోపించడం తెలిసిందే. అయితే, యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేది 2022లో కావడంతో, అప్పటిలోగా వ్యాక్సినేషన్ చాలావరకు ముందుకు సాగుతుందని, ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు ఉండబోవని భావిస్తున్నారు.
CEC
Elections
Assembly
Uttar Pradesh
Punjab
Uttarakhand
Manipur
Goa
Corona Second Wave
India

More Telugu News