Mamata Banerjee: బెంగాల్ సీఎస్ కు కేంద్రం షోకాజ్ నోటీసు! 

Center issues showcause notice to West Bengal CS

  • మోదీ రివ్యూ సమావేశానికి హాజరుకాని సీఎస్ బంధోపాధ్యాయ
  • మమతతో కలిసి వెళ్లిపోయిన వైనం
  • బంధోపాధ్యాయపై ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం

బెంగాల్ రాజకీయ పరిణామాలు రోజురోజుకూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలపన్ బంధోపాధ్యాయను కేంద్ర సర్వీసుకు బదిలీ చేస్తూ, వెంటనే నార్త్ బ్లాక్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

 అయితే కేంద్రం ఆదేశాలను కాదని ఆయన స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయనను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వ్యక్తిగత సలహాదారుడిగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయన మూడేళ్లపాటు సలహాదారుడిగా కొనసాగనున్నారు. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించింది.

తమ ఆదేశాల మేరకు నార్త్ బ్లాక్ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు రిపోర్టు చేయని నేపథ్యంలో బంధోపాధ్యాయకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయనపై ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని మీపై... క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీస్ రూల్స్ ను మీరు అతిక్రమించారని తెలిపారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో యాస్ తుపాను విపత్తుపై జరిగిన రివ్యూ సమావేశానికి బంధోపాధ్యాయ హాజరుకాకపోవడం క్రమశిక్షణారాహిత్యమని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ... ఎలాంటి  కారణాలను చూపకుండానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఆయన వెళ్లిపోయారని ఆరోపించారు. ఈ కారణంగానే సెంట్రల్ డిప్యుటేషన్ కు సిఫారసు చేస్తూ... కేంద్రం సమన్లు జారీ చేసిందని చెప్పారు.

మరోవైపు, ఈ విషయంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ని కానీ, హైకోర్టును కానీ బంధోపాద్యాయ ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది.

  • Loading...

More Telugu News