Prashant: ప్రేయసి కోసం పాకిస్థాన్ వెళ్లి, చిక్కుల్లోపడి... ఎట్టకేలకు తిరిగొస్తున్న తెలుగు టెక్కీ

Telugu techie who went Pakistan for girl friend was released

  • 2019లో పాక్ గడ్డపై అడుగుపెట్టిన ప్రశాంత్
  • అరెస్ట్ చేసిన పాక్ భద్రతా బలగాలు
  • సైబరాబాద్ సీపీని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
  • విదేశాంగ శాఖ చొరవతో ప్రశాంత్ విడుదల
  • వాఘా వద్ద భారత్ కు అప్పగించిన పాక్ అధికారులు

హైదరాబాదుకు చెందిన టెక్కీ ప్రశాంత్ ది ఓ వింతగాథ. ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే దేశ సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో ప్రవేశించి, అక్కడి భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అయితే, భారత అధికారుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ప్రశాంత్ విడుదలయ్యాడు.

2019లో పాకిస్థానీ గాళ్ ఫ్రెండ్ ను కలిసేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా ప్రశాంత్ సాహసం చేశాడు. పాస్ పోర్ట్ సహా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా పాక్ భూభాగంపై కాలుమోపాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి పరిస్థితి వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించడమే కాకుండా, భారత విదేశాంగ శాఖ అధికారులకు ఈ విషయం తెలియజేశారు.

అనేక ప్రయత్నాల అనంతరం ప్రశాంత్ ను విడుదల చేసిన పాక్ అధికారులు... వాఘా బోర్డర్ వద్ద అతడిని భారత అధికారులకు అప్పగించారు. నేడో, రేపో హైదరాబాద్ చేరుకుంటాడని భావిస్తున్నారు. ప్రశాంత్ విడుదల నేపథ్యంలో అతడి కుటుంబంలో సంతోషం పెల్లుబుకుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News