Iceland: 20 ఏళ్లలో 750 చదరపు కిలోమీటర్ల ఐస్​ లాండ్​ మంచు ఆవిరి!

Icelands Glaciers Lost 750 Square Kilometers In Last 20 Years Study

  • ఐస్ లాండ్ జర్నల్ జోకల్ అధ్యయనంలో వెల్లడి
  • 1890 నుంచి 2,200 చదరపు కిలోమీటర్లు కరిగిన మంచు
  • 2000 తర్వాతే మూడో వంతు ఐస్ కరుగుదల

భూతాపం ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఉదాహరణ ఇది. ఒకటి కాదు.. రెండు కాదు.. 20 ఏళ్లలో ఏకంగా 750 చదరపు కిలోమీటర్ల మేర ఐస్ లాండ్ లో మంచు కరిగిపోయింది. అంటే ఐస్ లాండ్ లో 7 శాతం ఐస్ నీళ్లలా మారిపోయింది. ఐస్ లాండ్ సైంటిఫిక్ జర్నల్ జోకల్ అధ్యయనంలో తేలిన విషయమిది.

2019 నాటికి 10,400 చదరపు కిలోమీటర్లకు ఐస్ లాండ్ మంచు కుదించుకుపోయిందని పేర్కొంది. 1890 నుంచి ఇప్పటిదాకా 2,200 చదరపు కిలోమీటర్ల మంచు కరిగిపోయిందని, అందులో మూడో వంతు 2000వ సంవత్సరం తర్వాతే కరిగిందని వెల్లడించింది. ఈ 20 ఏళ్లలో కరిగిన మంచు ఐస్ లాండ్ లోని అతిపెద్ద మంచు కొండ అయిన హాఫ్జోకల్ కు దాదాపు సమానమని తెలిపింది.

2014లో ఒక్జోకల్ అనే గ్లేసియర్ (హిమనీ నదం)ను ఆ హోదా నుంచి సైంటిస్టులు తప్పించారు. రెండేళ్ల క్రితం ఆ గ్లేసియర్ మొత్తం కరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2.2 లక్షల హిమనీ నదాలుండగా.. అందులో చాలా వరకు వేగంగా కరిగిపోతున్నాయని ఇటీవలి నాసా పరిశోధనల్లో తేలింది. సముద్ర మట్టాల పెరుగుదలలో వాటి నీరే ఐదో వంతు (20%) అని తేల్చారు.

2000 నుంచి 2019 మధ్య ఏటా 26,700 కోట్ల టన్నుల మంచు కరిగినట్టు నాసా టెరా ఉపగ్రహ చిత్రాల ద్వారా తేలింది. 2000 నుంచి 2004 మధ్య ఏటా 22,700 కోట్ల టన్నుల మంచు కరిగితే.. అదే 2015 నుంచి 2019 మధ్య ఏటా 29,800 కోట్ల టన్నుల మంచు కరిగినట్టు తేలింది.

  • Loading...

More Telugu News