Tamil Nadu: అమెరికాలో ఉంటూనే ఇండియాలో ఉన్న భార్య హత్యకు కుట్ర.. అయినా దొరికిపోయిన వైనం!

Man hires contract killers to kill his wife
  • మనస్పర్థలతో విడిపోయిన దంపతులు
  • విడాకులు తీసుకుంటే భరణం చెల్లించాల్సి వస్తుందని హత్యకు కుట్ర
  • బావ సూచనలతో కిరాయి హంతకులతో హత్య చేయించిన బావమరిది
  • అరెస్ట్ కోసం అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన పోలీసులు
అమెరికాలో ఉంటూనే భార్యను హత్య చేసిన భర్త దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమానంతో భర్త కుట్ర వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తిరువారూరు జిల్లాలో ఈ నెల 21న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. జయభారతి (28) విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో కడవయ్యూరు బ్రిడ్జి వద్ద ఓ మినీ ట్రక్కు ఆమెను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

కుమార్తెకు జరిగిన ప్రమాదంపై అనుమానం వచ్చిన జయభారతి తండ్రి ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం తన కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జయభారతి భర్త విష్ణు ప్రకాశ్‌కు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.

2015లో జయభారతి-విష్ణు ప్రకాశ్‌ల వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విష్ణు అమెరికాలో పనిచేస్తున్నాడు. అయితే, ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు రావడంతో జయభారతి అమెరికా నుంచి వచ్చేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఓ పోస్టాఫీసులో తాత్కాలికంగా పనిచేస్తున్నారు. దంపతుల మధ్య రాజీకి పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్తకు జయభారతి విడాకుల నోటీసు పంపారు.

అయితే, భార్యకు భరణం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో విడాకుల నోటీసును వెనక్కి తీసుకోవాలంటూ జయభారతిని, ఆమె కుటుంబ సభ్యులను విష్ణు ప్రకాశ్ బెదిరిస్తూ వచ్చాడు. అయినప్పటికీ వినకపోవడంతోనే ఈ హత్యకు పథకం పన్నినట్టు పోలీసులు గుర్తించారు. విష్ణు సోదరి భర్త సెంథిల్ కుమార్ ఈ హత్యకు పథక రచన చేసినట్టు నిర్ధారించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. బావ సూచనలతో కిరాయి హంతకులతో ఈ హత్యను చేయించినట్టు ఒప్పుకున్నాడు. విష్ణు ప్రకాశ్‌ను అరెస్ట్ చేసేందుకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు పోలీసులు తెలిపారు.
Tamil Nadu
America
Wife
Husband
Murder

More Telugu News