Judge Ramakrishna: జడ్జి రామకృష్ణ బ్యారెక్‌లోకి అపరిచితుడిని పంపారు.. ప్రాణహాని ఉంది: హైకోర్టుకు రామకృష్ణ కుమారుడి లేఖ
- రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జడ్జి రామకృష్ణ
- 42 రోజులుగా జైలులోనే
- అపరిచితుడిని వేరే బ్యారెక్‌లోకి పంపాలని కోరిన రామకృష్ణ తనయుడు
జైలులో ఉన్న తన తండ్రి రామకృష్ణ బ్యారెక్‌లోకి అపరిచితుడిని పంపారని, అతడు తన తండ్రిని బెదిరిస్తున్నాడని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ హైకోర్టుకు లేఖ రాశారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని, కాబట్టి వారిద్దరినీ వేర్వేరు బ్యారెక్‌లలో ఉంచాలని ఆ లేఖలో కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో ద్వేషం పెంచేలా ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన జడ్జి రామకృష్ణ 42 రోజులుగా జైలులోనే ఉంటున్నారు.
మరోవైపు, రామకృష్ణ వ్యవహారాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రామకృష్ణ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆయన తనయుడు వంశీకృష్ణ భయపడుతున్నారని చెప్పారు. కాబట్టి రామకృష్ణకు జైలులో భద్రత కల్పించాలని కోరారు.
జైలులో ఉన్న జడ్జి రామకృష్ణను బెయిలుపై విడుదల చేసి తగిన రక్షణ కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తన తండ్రి ప్రాణాలకు జైలులో ముప్పు ఉందని ఆయన కుమారుడు వంశీకృష్ణ హైకోర్టుకు లేఖ రాశారని అన్నారు.