AK Singhal: ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్
- కేంద్రాన్ని మందులు కోరామన్న సింఘాల్
- రోజుకు లక్షమందికి వ్యాక్సిన్ ఇవ్వగలమని వెల్లడి
- ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్
- 66 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్న సింఘాల్
ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ దీనిపై స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 808 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సరిపడా ఔషధాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. వ్యాక్సినేషన్ పైనా ఆయన వివరణ ఇచ్చారు. రోజుకు లక్ష మందికి వ్యాక్సిన్లు అందించే సామర్థ్యం ఉందన్నారు. కేంద్రం పంపిన డోసుల మేరకు ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు.
ఏపీలో విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలను ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మే 5 నుంచి కర్ఫ్యూ, 144 సెక్షన్ అమల్లో ఉందని వెల్లడించారు. మే 3న రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 25 శాతంగా ఉందని, అదిప్పుడు 17.29 శాతానికి తగ్గిందని సింఘాల్ వివరించారు. కొవిడ్ చికిత్సలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న 66 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.