Narendra Modi: టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌పై నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగిస్తున్నందుకు మోదీ లేఖ
- చాలా సంతోషించానన్న మోదీ
- దేశంలో భూమాతను, ప్రకృతిని పూజిస్తామని వ్యాఖ్య
- ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉందన్న మోదీ
రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా కాలంగా సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ ఓ లేఖ ద్వారా తనను అభినందించారని సంతోష్ కుమార్ వెల్లడించారు.
పచ్చదనం పెంపు అవసరాన్ని భారత్‌లోని ప్రతి ఒక్కరిలో స్ఫురింపచేస్తున్నారని లేఖలో సంతోష్‌ను ప్రధాని ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకుని తాను చాలా సంతోషించానని చెప్పారు. పరిశుభ్రత అవసరాన్ని అందరికీ తెలియచేస్తున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. దేశంలో భూమాతను, ప్రకృతిని పూజించటం ఆది నుంచీ వస్తున్న మన సంప్రదాయాలు, సంస్కృతిలో భాగమని చెప్పారు.
ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సంతోష్ కుమార్ కృషి చేస్తున్నారని అన్నారు. మనమందరమూ భూమాత పిల్లలమే అని పేర్కొన్నారు. ప్రకృతితో సహజీవనం, సమన్వయం మన జీవనమార్గాలు కావాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చదనం విషయంలో అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సౌరశక్తి లాంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రోత్సాహం కూడా ఉండాలని చెప్పారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కూడా కృషి చేయాల్సి ఉందని, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ నిషేధం వంటివి అవసరమని గుర్తు చేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రాముఖ్యతలను తెలుపుతూ సంతోష్ కుమార్ వెలువరించిన వృక్షవేదం పుస్తకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువత వృక్షవేదం పుస్తకాన్ని చదవాలని ఆయన చెప్పారు. ప్రకృతి ప్రాధాన్యతను తెలుసుకోవాలని అన్నారు. అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని, పచ్చదనాన్ని పెంచే యజ్ఞంలో పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.