choksi: ఛోక్సీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.. ఆయన శరీరంపై తీవ్రగాయాలున్నాయి: డొమినికా న్యాయవాదులు
- భారత్‌కు అప్పగించడంపై అక్కడి కోర్టు స్టే
- ఛోక్సీతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న న్యాయవాదులు
- చివరకు వీడియో కాల్‌లో మాట్లాడామని వివరణ
- అరెస్టు చేయడం వంటి సంఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్య
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మెహుల్ ఛోక్సీ భారత్ నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఆంటిగ్వాలో అదృశ్యం కాగా, చివరకు డొమినికా దీవిలో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది.
కొంతమంది వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి డొమినికా తీసుకెళ్లారని ఛోక్సీ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది ఆరోపించారు. దీంతో ఆయనను భారత్‌కు అప్పగించడంపై అక్కడి కోర్టు స్టే విధించింది. పోలీసుల అదుపులో ఉన్న ఛోక్సిని ఆయన న్యాయవాదుల బృందం కలిసేందుకు అనుమతి కూడా ఇవ్వలేదు.
ఛోక్సీతో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించిన అనంతరం వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అంగీకరించినట్లు డొమినికాలోని ఆయన లాయర్ వేన్ మార్ష్ అన్నారు. ఛోక్సీని తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోందని, ఆయన కళ్లు ఉబ్బిపోయాయని, శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయని తెలిపారు.
ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ వద్ద కొందరు ఆయనను బలవంతంగా ఓ బోటులో డొమినికా తీసుకొచ్చారని న్యాయవాదులు చెప్పారు. ఈ వివరాలను ఛోక్సీ తమకు తెలిపారని వివరించారు. వారు భారత్ లేదా ఆంటిగ్వా పోలీసులు అయి ఉంటారని ఆయన అన్నారు. ఛోక్సీ ఉన్నట్టుండి అదృశ్యమవడం చివరకు డొమినికా పోలీసులు అరెస్టు చేయడం వంటి సంఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిపారు.
ఛోక్సీని భారత్‌కు తీసుకెళ్లేందుకు డొమినికా తీసుకెళ్లి ఉంటారని ఆరోపించారు. ఛోక్సీకి భారత్ పౌరసత్వం లేదని ఆయన అన్నారు. అలాంటప్పుడు భారత్‌కు ఆయనను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఈ రోజు అక్కడి కోర్టు మరోసారి విచారణ జరపనుంది. కాగా, ఛోక్సీ ఇప్పటికీ భారతీయుడేనని భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అప్పగింతపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెబుతున్నాయి.