Karnataka: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు హెచ్ఎస్ దొరెస్వామి కన్నుమూత

Freedom Fighter HS Doreswamy Dies in Bengaluru

  • గుండెపోటుతో మధ్యాహ్నం 1.40 గంటలకు మరణం
  • జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా సేవలు
  • నిన్నమొన్నటి వరకు పలు ఉద్యమాలు
  • సంతాపం తెలిపిన పలువురు నేతలు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త హెచ్ఎస్ దొరెస్వామి నేడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 103 సంవత్సరాలు. కర్ణాటకకు చెందిన దొరెస్వామి అనారోగ్య కారణాలతో ఈ నెల 8న బెంగళూరులోని  శ్రీ జయదేవ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎస్‌జేఐసీఎస్ఆర్) ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

 ఆరోగ్యం మెరుగవడంతో 13న డిశ్చార్జి అయ్యారు. అయితే, ఆ మరుసటి రోజు నీరసంగా ఉందని మళ్లీ అదే ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉన్న ఆయన నేటి మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూసినట్టు ఆయన విశ్వసనీయ సన్నిహితుడు సిరిమానే నాగరాజు తెలిపారు. దొరెస్వామికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

10 ఏప్రిల్ 1918లో బెంగళూరు సమీపంలోని హరోహళ్లలో దొరెస్వామి జన్మించారు. ఐదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ నుంచి బీఎస్సీ పట్టా అందుకున్నారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను 14 నెలలు జైలు శిక్ష అనుభవించారు.

 జర్నలిస్టుగానూ పనిచేసిన దొరెస్వామి.. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం సామాజిక సేవలోకి అడుగుపెట్టారు.  ఇండియా అగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాసినందుకు జైలు పాలయ్యారు. దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టనంత వరుకు పలు ఉద్యమాలు చేశారు. కర్ణాటకలో మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేపట్టారు.

దొరెస్వామి మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్‌డీ కుమారస్వామి తదితరులు సంతాపం తెలిపారు.

Karnataka
Freedom Fighter
HS Doreswamy
Bengaluru
  • Loading...

More Telugu News