Black Day: రైతు ఉద్యమానికి నేటితో ఆరు నెలలు.. ‘బ్లాక్ డే’ పాటిస్తున్న రైతులు

Farmers observe black day today Sidhu hoists black flag atop Patiala house

  • బ్లాక్ డేకు నవజోత్ సింగ్ సిద్ధూ మద్దతు
  • ఇంటిపై నల్లజెండా ఎగురవేత
  • ఢిల్లీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తయ్యాయి. దీంతో రైతు సంఘాలు నేడు ‘బ్లాక్ డే’కు పిలుపునిచ్చాయి. నేడు బుధ పూర్ణిమ అని, సమాజంలో సత్యం, అహింస జాడ కరవైందని ఆవేదన వ్యక్తం చేసిన కిసాన్ సంయుక్త మోర్చా.. ఈ విలువల పునరుద్ధరణ జరిగేలా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసన తెలపాలని రైతులను కోరింది. బ్లాక్ డేకు మద్దతుగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలాలోని తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.

రైతుల బ్లాక్ డే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో  లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. మరోవైపు, కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడంపై ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై  నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.

బ్లాక్‌డే నిర్వహణపై రైతు నేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ.. ఎక్కడా గుంపులుగా చేరబోమని, బహిరంగ సమావేశాలు ఉండవని స్పష్టం చేశారు. నల్ల జెండాలను మాత్రం ఎగురవేస్తామన్నారు. ప్రజలు ఎక్కడి వారు అక్కడే తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమం ఆరు నెలలు పూర్తిచేసుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో స్పందించడం లేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News