Mekathoti Sucharitha: ఎవరూ భయాందోళనలకు గురికావొద్దు: హెచ్ పీసీఎల్ ప్రమాదంపై హోంమంత్రి మేకతోటి సుచరిత
- విశాఖ హెచ్ పీసీఎల్ లో అగ్నిప్రమాదం
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి
- అధికారులకు ఫోన్ లో ఆదేశాలు
- సహాయక చర్యలపై మంత్రికి వివరించిన అధికారులు
విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీలో ఈ మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరగడం పట్ల ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి, వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి, ప్రమాద సమాచారం తెలుసుకున్నారు.
ప్రజలెవ్వరూ భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదని తెలిపారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యల గురించి తెలుసుకుంటున్నట్టు హోంమంత్రి కార్యాలయం వెల్లడించింది.
కాగా, ప్రమాదం జరిగిన వెంటనే హెచ్ పీసీఎల్ లోని 5 ఫైర్ ఇంజన్లకు తోడు మరో 7 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగాయని, సైరన్ మోగించి ఉద్యోగులను బయటికి పంపించివేసినట్టు అధికారులు మంత్రి మేకతోటి సుచరితకు తెలిపారు.