Prisoners: కరోనాతో చనిపోతామనే భయం ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వలేము: సుప్రీంకోర్టు

Can not grant anticipatory bail in the name of corona death fears says Supreme Court

  • కరోనా నేపథ్యంలో బెయిల్ ఇవ్వొచ్చన్న అలహాబాద్ హైకోర్టు
  • సుప్రీంకోర్టులో సవాల్ చేసిన యూపీ ప్రభుత్వం
  • హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు

కేసు తీవ్రత, స్వభావాన్ని ఆధారంగా చేసుకునే నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరుగుతుందని... కరోనా కారణంగా చనిపోతామనే భయం ఆధారంగా చేసుకుని బెయిల్ ఇవ్వలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, ఇదే కారణంగా ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇతర న్యాయస్థానాలు ఒక ఆధారంగా తీసుకుని, బెయిల్ ఇవ్వకూడదని చెప్పింది.

వివరాల్లోకి వెళ్తే... ఇటీవల ఒక కేసును ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ కోర్టు విచారించింది. ఇప్పటికే జైళ్లు నిండిపోయాయని... కరోనా విజృంభిస్తున్న వేళ జైళ్లలో ఉండే నిందితులకు, జైల్లోని వారి సహచరులకు, పోలీసులకు కూడా రిస్క్ ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులకు కొంత కాలం పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కూడా ఉదహరించింది. ఆరోగ్యంగా జీవించే హక్కు నిందితులకు, జైల్లోని సహచరులకు, పోలీసు సిబ్బందికి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పుపై యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇటీవల ఓ పిటిషన్ ను ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తూ... నిందితుడిపై ఉన్న క్రిమినల్ ఛార్జీల ఆధారంగా బెయిల్ మంజూరు చేయవచ్చని తీర్పును వెలువరించింది. అయితే, ఈ బెయిల్ కు సంబంధించి సంబంధిత ప్యానెల్ రికమెండ్ చేయాలని తెలిపింది.

ఈ రోజు విచారణ సందర్భంగా... యూపీ ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ... నిందితుడి నేర చరిత్ర ఆధారంగానే బెయిల్ మంజూరు చేయాలని చెప్పింది. కేవలం కరోనా భయాల కారణంగా బెయిల్ మంజూరు చేయడం కుదరదని స్పష్టం చేసింది. తాము తదుపరి ఆదేశాలను వెలువరించేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నామని జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ ల ధర్మాసనం తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News