Myanmar: సైనిక తిరుగుబాటు తర్వాత తొలిసారి న్యాయస్థానంలో హాజరైన అంగ్ సాన్ సూకీ
- ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు
- అప్పటి నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించని సూకీ
- ఆమెను ఎక్కడ నిర్బంధించారన్న విషయం సూకీకి కూడా తెలియదన్న న్యాయవాది
- అభియోగాలు రుజువైతే 14 ఏళ్ల జైలు శిక్ష
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత పదవి కోల్పోయి, సైన్యం నిర్బంధంలో ఉన్న అంగ్ సాన్ సూకీ నిన్న న్యాయస్థానంలో హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సూకీ సహా 4 వేల మందిని నిర్బంధించింది. ఆ తర్వాత అంటే దాదాపు మూడు నెలల తర్వాత సూకీ కనిపించడం ఇదే తొలిసారి.
సూకీని నిర్బంధించిన సైన్యం అధికార రహస్యాలను వెల్లడించడం, అక్రమంగా వాకీటాకీలను ఉంచుకోవడం వంటి అభియోగాలను నమోదు చేసింది. ఈ నేరం కనుక రుజువైతే సూకీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయస్థానంలో హాజరైన సూకీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఆమెను ఎక్కడ నిర్బంధించారన్న విషయం సూకీకి కూడా తెలియదని కోర్టుకు తెలిపారు.