Somu Veerraju: సోము వీర్రాజు శాసనమండలి సభ్యత్వం నేటితో పూర్తి.. అందరికీ కృతజ్ఞతలు చెప్పిన వీర్రాజు
- మండలి సభ్యుడిగా ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న వీర్రాజు
- మండలిలో పలు అంశాలపై తన వాణిని వినిపించానని వ్యాఖ్య
- సభ లోపల, బయట ఉద్యమాలు, పోరాటాలు చేశానన్న వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు శాసనమండలి సభ్యత్వం నేటితో పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఒక లేఖను విడుదల చేశారు. శాసనమండలి సభ్యుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటంలో తనకు అన్ని విధాలా సహకరించిన బీజేపీ, అనుబంధ సంఘాల నేతలు, పార్టీ కార్యకర్తలు, తోటి శాసనమండలి సభ్యులు, అధికార, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం శాసనమండలి వేదికగా ఈ ఆరేళ్లలో పలు ముఖ్యమైన అంశాలపై తన వాణిని వినిపించానని వీర్రాజు తెలిపారు. గత, ఇప్పటి ప్రభుత్వాలు మంచి చేసిన సమయంలో అభినందించానని, అలాగే పాలక పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్న సమయంలో బీజేపీ ప్రతినిధిగా సభ లోపల, బయట ఉద్యమాలు, పోరాటాలు చేశానని చెప్పారు.
ప్రజాభిప్రాయం మేరకు పార్టీ ద్వారా పలు అంశాల పరిష్కారానికి సభలో చర్యలు చేపట్టానని వీర్రాజు తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజల సమస్యలపై, ప్రజారోగ్యం, పిల్లలకు పౌష్టికాహారం విషయంలో అంగన్వాడి కేంద్రాలలో ప్రజలకు అందాల్సిన విషయంలో ప్రభుత్వ అధికారులను ఎండగడుతూ చేసిన ఉద్యమాలు సభలో కానీ, బయటకానీ విజయవంతమయ్యాయని తెలిపారు. ఆ విషయంలో మండలి సభ్యుడిగా తనకు సంతృప్తి ఉందని చెప్పారు.
కోవిడ్ విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, మౌలిక సదుపాయాలు పెంచుకోవాలని గతంలోనే సభలో సూచించానని తెలిపారు. ఈ పోరాటంలో తనకు అన్ని విధాలా సహకరించిన అన్ని పార్టీలకు, మీడియా మిత్రులకు, ఉద్యోగ సంఘాలకు, అధికారులకు కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు.