Black Fungus: ఏ ఫంగస్ సోకినా మధుమేహం నియంత్రణలో ఉండడమే కీలకం: వైద్య నిపుణులు

Medical experts says sugar levels key to fight any fungus

  • భారత్ లో కరోనా రోగులకు బ్లాక్, వైట్ ఫంగస్ లు
  • తాజాగా ఎల్లో ఫంగస్ గుర్తింపు
  • మధుమేహ బాధితుల్లో ఇమ్యూనిటీ తక్కువన్న నిపుణులు
  • త్వరగా ఇన్ఫెక్షన్ల బారినపడతారని వెల్లడి

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ బ్లాక్ ఫంగస్ రూపంలో మరో కలకలం రేగడం తెలిసిందే. దీనికి తోడు వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కూడా కరోనా రోగుల్లో ప్రమాద హేతువులుగా మారాయని గుర్తించారు. బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్ మైకోసిస్), వైట్ ఫంగస్ (కాండిడియాసిస్) కేసులు దేశవ్యాప్తంగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్య నిపుణులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. అది బ్లాక్ ఫంగస్ కానివ్వండి, వైట్ ఫంగస్ కానివ్వండి... ముప్పు నుంచి తప్పించుకోవాలంటే షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుకోవడమే ప్రధాన మార్గమని అంటున్నారు.

షుగర్ లెవల్స్ సాధారణ రీతిలో ఉంటే వారిలో ఇమ్యూనిటీ స్థాయులు పెరుగుతాయని, తద్వారా ఫంగస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. డయాబెటిస్ తో బాధపడే వ్యక్తుల్లో సహజంగానే రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని, ఇలాంటివారికి ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువని వివరించారు. మధుమేహ బాధితులు స్టెరాయిడ్లు వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుందని, తద్వారా కొవిడ్ తో సోకే ఫంగస్ లు వీరిని బలిగొనే అవకాశాలు ఎక్కువని నాగపూర్ కు చెందిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ హిమాంశు పాటిల్ తెలిపారు.

కాగా, బ్లాక్ ఫంగస్ సోకినవారిలో లక్షణాలు బయటికి కనిపిస్తాయి, కానీ వైట్ ఫంగస్ సోకినవారిలో ఊపిరితిత్తులు, ఇతర శరీర అవయవాలు అప్పటికప్పుడు దెబ్బతింటాయని గుర్తించారు. అలాంటి రోగుల్లో కరోనా తరహా లక్షణాలు కనిపించినా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాత్రం నెగెటివ్ అనే వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  కొవిడ్ కారణంగా ఉపిరితిత్తులు దెబ్బతింటున్నాయని సీటీ స్కాన్ లో చూసి భావిస్తున్నారని, వాస్తవానికి అది వైట్ ఫంగస్ కారణంగా జరిగిన నష్టం అని పేర్కొంటున్నారు.

కరోనా నుంచి కోలుకున్న తర్వాత కానీ, కరోనా చికిత్స పొందుతున్నప్పుడు కానీ ప్రజలు ఈ తరహా ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని, ఆ ఇన్ఫెక్షన్ బారినపడుతున్న వాళ్లందరూ మధుమేహ బాధితులేనని డాక్టర్ జయంత్ కేల్వాడే వెల్లడించారు. అందుకే కరోనా సోకిన వారు షుగర్ స్థాయులను తరచుగా పరీక్షించుకోవాలని, వ్యక్తిగత శుభ్రత చాలా అవసరమని స్పష్టం చేశారు.

నిత్యం వ్యాయామం, తేలికపాటి బరువులు ఎత్తడం వంటి చర్యలతో ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కసరత్తులో బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని డాక్టర్ హిమాంశు పాటిల్ తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారు ఇమ్యూనిటి పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని, ఇమ్యూనిటీ తగ్గినప్పుడే ఫంగస్ లు దాడి చేస్తుంటాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News