Chevireddy Bhaskar Reddy: ఆనందయ్య మందుపై ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ప్రణాళికలు సిద్ధం చేసింది: చెవిరెడ్డి
- ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్, ఐసీఎంఆర్ అధ్యయనం
- సమావేశమైన ఎస్వీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నిపుణులు
- అనుమతి వస్తే ఎస్వీ ఫార్మసీలో తయారుచేస్తామన్న చెవిరెడ్డి
- శేషాచలం అడవుల్లో మూలికలు ఉన్నాయని వివరణ
ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్, ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల నివేదికల కోసం చూస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఆనందయ్య మందుపై సానుకూల నివేదికలు వస్తే, ఆ మందును ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో తయారుచేస్తామని తెలిపారు. ఆ మేరకు ఆయుర్వేద ఫార్మసీ ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. శేషాచలం అడవుల్లో ఔషధం తయారీకి అవసరమైన వనమూలికలు విరివిగా లభ్యమవుతాయని చెవిరెడ్డి పేర్కొన్నారు.
ఒకవేళ, ఆనందయ్య మందును ఆయుష్, ఐసీఎంఆర్ పరిశోధకులు కరోనా మందు కాదని తేల్చినా, దాన్ని వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసే మందుగా పరిశీలిస్తామని తెలిపారు. కాగా, ఆనందయ్య మందుకు పరిశోధక బృందాల నుంచి అనుమతులు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ఎస్వీ ఆయుర్వేదిక్ ఫార్మసీ నిపుణులు ఈ ఉదయం చర్చించారు.