Somu Veerraju: ఏపీ బడ్జెట్ ను, గవర్నర్ ప్రసంగంలోని అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: సోము వీర్రాజు
- నిన్న ఏపీ బడ్జెట్ సమర్పణ
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
- ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందన్న సోము
- కేంద్ర పథకాలను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడంలేదని విమర్శ
నిన్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించగా, దానిపై ఇవాళ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. ఏపీ బడ్జెట్ ను, గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ఏపీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. కొవిడ్ పై ప్రభుత్వ వైఖరి, రైతాంగంపై ప్రభుత్వ వైఖరిని తాము ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు చెప్పుకుంటున్న సంక్షేమ పథకాల కంటే చేయాల్సిన సంక్షేమం ఇంకా చాలా ఉందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. జగన్ చేపడుతున్న కార్యక్రమాల కంటే అవసరమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయని చెప్పారు.
ఎన్ఎస్ఎఫ్ డీసీ పథకం ద్వారా ఎస్సీలకు వ్యక్తిగతంగా సాయం చేయాలని కేంద్రం భావిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఈ పథకంలో భాగంగా రూ.15 లక్షల విలువైన ఇన్నోవా వాహనాలు పేద ఎస్సీలకు అందించే వీలుందని, అయితే రెండేళ్లుగా ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం మరుగునపడవేసిందని ఆరోపించారు. పేదలకు వ్యక్తిగతంగా రుణసదుపాయం అందించే పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వెలిబుచ్చారు.