Mamata Banerjee: తన పాత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న మమతా బెనర్జీ
- నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన మమత
- ఆరు నెలల్లోగా గెలవాల్సిన ఆవశ్యకత
- భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న దీదీ
పశ్చిమబెంగాల్ కు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ... నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోగా ఆమె ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో, తన పాత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. భవానీపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి చటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన స్థానం నుంచి దీదీ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. అయితే ఈ 6 నెలల కాలం ఆయన మంత్రిగానే కొనసాగనున్నారు.
భవానీపూర్ ఓటరుగా మమతా బెనర్జీ ఉన్నారు. ఎన్నికల సందర్భంగా దీదీ మాట్లాడుతూ... నందిగ్రామ్ తన లక్కీ ప్లేస్ అని, అందుకే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. భవానీపూర్ ప్రజలు తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అన్నారు. నందిగ్రామ్ తన పెద్ద సోదరి, భవానీపూర్ తన చిన్న సోదరి అని చెప్పారు.