Andhra Pradesh: ఏపీలో 13 పీఎస్ఏ ప్లాంట్లు.. కేంద్ర మంత్రికి సురేశ్ ప్రభు ప్రతిపాదనలు
- ఆరోగ్య శాఖ మంత్రికి ఎంపీ సురేశ్ ప్రభు లేఖ
- ఆక్సిజన్ కొరతను అధిగమించొచ్చని సూచన
- కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు
ఏపీలోని 13 జిల్లాల్లో ప్రెజర్ స్వింగ్ అడ్జార్ప్షన్ (పీఎస్ఏ) టెక్నాలజీ ఆధారంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కు రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు లేఖ రాశారు. దాని వల్ల ఆక్సిజన్ కొరతను భారీగా తగ్గించి ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడొచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందని, అదిప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రరూపం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల చాలా మందికి ఆక్సిజన్ అందట్లేదని అన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఒక్కో పీఎస్ఏ ప్లాంట్ ను ఏర్పాటు చేసినా కొరతను అధిగమించొచ్చని సూచించారు.
కాగా, ఆయన ప్రతిపాదనలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు చూపిస్తున్న అభిమానమేంటో మీ సంక్షేమ పథకాలు, మీరు తీసుకొంటున్న చొరవే తెలియజేస్తున్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు.