Perarivalan: రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్‌కు నెల రోజులపాటు షరతులు లేని పెరోల్
- 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య
- ఏడుగురు దోషుల్లో పేరరివాలన్ ఒకడు
- తల్లి వినతికి స్పందించి పెరోల్ ఇవ్వాలని ఆదేశించిన సీఎం
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏజీ పేరరివాలన్ పెరోల్‌పై నెల రోజులపాటు బయటకు రానున్నాడు. చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలులో ఉన్న పేరరివాలన్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల క్షీణించింది. దీంతో రెండు నెలలపాటు తన కుమారుడికి పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ అతడి తల్లి అర్బుదమ్మాళ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు వినతిపత్రం పంపారు. పరిశీలించిన ముఖ్యమంత్రి పేరరివాలన్‌కు 30 రోజులపాటు షరతులు లేని సాధారణ పెరోల్ మంజూరు చేయాలని నిన్న జైళ్ల శాఖను ఆదేశించారు.
రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్లో పేరరివాలన్ ఒకడు. 21 మే 1991న శ్రీపెరుంబదూర్ సమీపంలో మహిళా సూసైడ్ బాంబర్ ధాను చేతిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. కాగా, గతేడాది మద్రాస్ హైకోర్టు పేరరివాలన్‌కు మెడికల్ చెకప్ కోసం 30 రోజుల పెరోల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు దానిని మరో వారం రోజులపాటు పొడిగించింది.