Telangana: ఎట్టకేలకు ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిన తెలంగాణ

Telangana joins Ayushman Bharat scheme
  • అన్ని వైపుల నుంచి సర్కారుపై ఒత్తిళ్లు
  • కేంద్ర పథకంలో చేరతామని కొంతకాలంగా సంకేతాలు
  • కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం
  • మార్గదర్శకాలు ఖరారు చేసిన రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ (పీఎం జన్ ఆరోగ్య యోజన) లో చేరేందుకు తొలుత విముఖత చూపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనసు మార్చుకుంది. కరోనా నేపథ్యంలో అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొంతకాలంగా ఆయుష్మాన్ భారత్ లో చేరతామని సీఎం కేసీఆర్ సంకేతాలు ఇస్తున్నారు.

ఈ మేరకు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏ రిజ్వీ... రాష్ట్ర ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓకు పథకం అమలుపై ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కరోనా చికిత్సకు లబ్దిదారుడు రూ.5 లక్షల వరకు ప్రయోజనం పొందే వీలుంది. అయితే, ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం ఉంటుందని, అదే ఆరోగ్యశ్రీ అయితే 84 లక్షల మంది ప్రయోజనం పొందుతారని తెలంగాణ ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది.
Telangana
Ayushman Bharat
KCR
Arogyasri
Corona Virus

More Telugu News