NMU: ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి: సీఎం జగన్ కు ఎన్ఎంయూ లేఖ

APSRTC NMU wrote CM Jagan

  • రూ.50 లక్షల బీమా సౌకర్యం ఇవ్వాలన్న ఎన్ఎంయూ
  • కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
  • అన్ని ప్రయోజనాలు కల్పించాలని వినతి
  • పాజిటివ్ ఉద్యోగులకు 30 రోజుల సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి

కరోనా కష్టకాలంలో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసింది. ఆర్టీసీ కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి రూ.50 లక్షల బీమా సౌకర్యం అందజేయాలని కోరింది. చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు కల్పించాలని, కారుణ్య నియామకాల ద్వారా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఎన్ఎంయూ విజ్ఞప్తి చేసింది.

కరోనా బారినపడిన ఆర్టీసీ ఉద్యోగులకు హెల్త్ కార్డు ద్వారా చికిత్స అందించాలని, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ప్రకటించాలని స్పష్టం చేసింది. సీఎం తక్షణమే చర్యలు తీసుకుని ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలని ఎన్ఎంయూ తన లేఖలో కోరింది. ఇప్పటివరకు 9,200 మంది కార్మికులు కరోనా బారినపడ్డారని, 240 మంది చనిపోయారని వెల్లడించింది. ఇప్పటివరకు 50 శాతం ఉద్యోగులకు కూడా వ్యాక్సినేషన్ కాలేదని వివరించింది.

  • Loading...

More Telugu News