Nellore District: నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు: సోనూ సూద్ హామీ

Sonu Sood Ready To Build Oxygen Plant at Nellore
  • ఆక్సిజన్ బెడ్లు దొరక్క సోనూ స్నేహితుడి కుటుంబ సభ్యుల మృతి
  • మిత్రుడి కోరిక మేరకు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన నటుడు
  • ధ్రువీకరించిన మంత్రి మేకపాటి
కొవిడ్ బాధితులను ఆదుకుంటూ ఎంతోమంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతున్న వేళ నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాడు.

 నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూ మిత్రుడు సమీర్ ఖాన్ కుటుంబ సభ్యులు ఇటీవల కరోనాతో మృతి చెందారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ పడకలు దొరకకపోవడమే వారి మృతికి కారణం. దీంతో తీవ్ర కలత చెందిన సోనూ సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ కోరిక మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించాడు.

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూ ముందుకొచ్చిన విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి సమీర్ తీసుకెళ్లాడు. సోనూతో ఫోన్‌లో మాట్లాడించాడు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆత్మకూరు, లేదంటే కావలిలో సరైన స్థలం కోసం వెతుకుతున్నారు. సోనూ ఆక్సిజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను సూద్ అందిస్తున్నారని పేర్కొన్నారు.
Nellore District
Oxygen Plant
Sonu Sood

More Telugu News