Salman Khurshid: ఫలితాలను చూసి కుంగిపోవద్దు.. బీజేపీని చూసి నేర్చుకోండి: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
- బలహీనంగా ఉన్నామని అనుకోవద్దు
- నిరాశావాదం దరిచేరకుండా చూడండి
- బీజేపీలాగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి
ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమిని చూసి కుంగిపోవద్దని, నిరాశావాదం పనికిరాదని అన్నారు. ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుర్షీద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని చోట్ల బలంగా, మరికొన్ని చోట్ల బలహీనంగా ఉన్నామని ఎప్పుడూ అనుకోవద్దని పార్టీ నేతలు, శ్రేణులకు సూచించారు.
ఓడినా, గెలిచినా బీజేపీలాగా ఆలోచిస్తూ ముందుకు సాగాలని అన్నారు. ఫలితాలను చూసి కుంగిపోవద్దని ఈ విషయంలో బీజేపీని చూసి నేర్చుకోవాలని అన్నారు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కేడర్‌ను కోల్పోయామన్న నిరాశ వద్దని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ, తర్వాతి లక్ష్యంపైనే దృష్టి సారించాలని ఖుర్షీద్ సూచించారు. పశ్చిమ బెంగాల్, అసోంలలో జరిగిన వ్యూహాత్మక ఓటింగే కాంగ్రెస్, వామపక్షాల ఓటమికి కారణమన్న వాదనను ఖుర్షీద్ అంగీకరించారు.