NEFT: ఈ నెల 23న నెఫ్ట్ సేవలకు సుదీర్ఘ అంతరాయం: ఆర్బీఐ ప్రకటన
- నెఫ్ట్ సాఫ్ట్ వేర్ లో మార్పులు
- వచ్చే ఆదివారం అప్ డేట్ చేస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడి
- 14 గంటల పాటు నిలిచిపోనున్న నెఫ్ట్
- ఆర్టీజీఎస్ సేవలు యథాతథం
ఆన్ లైన్ లో నగదు చెల్లింపుల వ్యవస్థ నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్)కు ఈ నెల 23న సుదీర్ఘ సమయం పాటు అంతరాయం కలగనుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. వచ్చే ఆదివారం నాడు నెఫ్ట్ సేవలు 14 గంటల పాటు అందుబాటులో ఉండవని ఆర్బీఐ తెలిపింది. సాంకేతిక కారణాల రీత్యా నెఫ్ట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నెఫ్ట్ వ్యవస్థలో ఉపయోగించే సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తున్నామని ఆర్బీఐ వివరించింది.
మే 22న వ్యాపార పనివేళలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల నుంచి మే 23 మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ వ్యవస్థ పనిచేయదని స్పష్టం చేసింది. అయితే, ఆర్టీజీఎస్ సేవలు మాత్రం కొనసాగుతాయని వెల్లడించింది. ఈ అంశంపై ఆయా బ్యాంకులు వారి ఖాతాదారులకు ముందస్తు సమాచారం అందిస్తాయని పేర్కొంది.