Mynmar: విశ్వ సుందరి పోటీల వేదికపై మయన్మార్ మిలటరీ పాలనపై నిరసన గళం
- మయన్మార్ సుందరాంగి ప్లకార్డ్
- ప్రజలు రోజూ చనిపోతున్నారని ఆవేదన
- ఫైనల్ రౌండ్ లో ఓడిపోయిన థుజార్ వింత్ లువిన్
- మయన్మార్ సంప్రదాయ దుస్తుల్లో వేదికపైకి
- ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి
మయన్మార్ లో ఆర్మీ జుంటా ఎన్నెన్ని అకృత్యాలకు పాల్పడిందో తెలిసిందే. అయితే, ఆ అణచివేతపై గళమెత్తేందుకు విశ్వ సుందరి పోటీలనే వేదికగా ఎంచుకుంది మయన్మార్ సుందరి థుజార్ వింత్ లువిన్. పోటీల్లో పాల్గొన్న లువిన్.. ‘మయన్మార్ కోసం ప్రార్థించండి’ అంటూ ప్లకార్డ్ ను ప్రదర్శించింది. మయన్మార్ సంప్రదాయ దుస్తుల్లో వేదికపై నడిచింది.
సైన్యం దురాగతాలకు తమ ప్రజలు రోజూ చనిపోతూనే ఉన్నారని ఆమె పోటీలో భాగంగా ఇచ్చిన వీడియో సందేశంలో పేర్కొంది. దయచేసి ప్రపంచమంతా మయన్మార్ కోసం గళమెత్తాలని విజ్ఞప్తి చేసింది. మిస్ యూనివర్స్ మయన్మార్ గా గెలిచిన తాను.. మిలటరీ గ్రూపు పాలనపై ఎప్పటికప్పుడు గొంతెత్తుతూనే ఉన్నానని చెప్పింది.
మిస్ యూనివర్స్ ఫైనల్ రౌండ్ లో ఆమె విఫలమైనా.. ఉత్తమ జాతీయ వస్త్రధారణ అవార్డు గెలుచుకుంది. కాగా, ఫిబ్రవరి 1న మొదలైన మయన్మార్ మిలటరీ గ్రూపు పాలనలో ఇప్పటిదాకా 790 మంది పౌరులు బలయ్యారు. 5 వేల మందిని అరెస్ట్ చేశారు. 4 వేల మందిని ఇళ్లలోనే బందీలుగా చేశారు.