Raj Nath Singh: డీఆర్డీవో అభివృద్ధి చేసిన కరోనా ఔషధం '2-డియాక్సీ డి-గ్లూకోజ్' విడుదల
- రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా విడుదల
- శరీరంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే 2డీజీ
- తొలి విడతలో భాగంగా పది వేల సాచెట్లు అందుబాటులోకి
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2డీజీ) ఔషధం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా విడుదలైంది. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ ఔషధాన్ని గతంలో కేన్సర్ కోసం తయారు చేశారు. మానవ శరీరంలో కేన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఇదే సూత్రంతో కరోనా వైరస్ చికిత్స కోసం పరిశోధన ప్రారంభించి కొన్ని నెలలుగా కృషిచేశారు. మనిషి శరీరంలోకి ప్రవేశించిన కరోనా కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదని పరిశోధకులు గుర్తించారు. దీంతో శరీరంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు.
తొలి విడతలో భాగంగా 2డీజీ ఔషధం పది వేల సాచెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది జూన్‌లో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి ఈ ఔషధం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం దీన్ని రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తోంది. నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో దీన్ని తీసుకొచ్చారు.