Ramadevi: నా భర్తను జైల్లో చంపేస్తారు: రఘురామ భార్య రమాదేవి

Raghurama wife Ramadevi made serious allegations
  • రఘురామను గుంటూరు జైలుకు తరలించిన పోలీసులు
  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రఘురామ అర్ధాంగి
  • తన భర్తేమీ క్రిమినల్ కాదని వెల్లడి
  • ఏదైనా జరిగితే సీఎం జగన్, సీఐడీ డీఐజీ సునీల్ బాధ్యత వహించాలని వ్యాఖ్యలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు గుంటూరు జిల్లా జైలుకు తరలించిన నేపథ్యంలో, ఆయన అర్ధాంగి రమాదేవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తను జైల్లో చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పటికే కడపకు చెందిన వ్యక్తులను జైలుకు పక్కా ప్రణాళికతో ముందుగానే తరలించారని వివరించారు.

తన భర్తను మొన్న సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అర్ధరాత్రి వేళ ఆయనను తీవ్రంగా కొట్టారని వెల్లడించారు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రఘురామను బెదిరించారని, ఆయన అందుకు అంగీకరించకపోవడంతో బాగా కొట్టారని తెలిపారు. ఆయన అరెస్టయిన సమయంలో బాగా నడుచుకుంటూ వెళ్లారని, అలాంటిది ఒక్కరోజులో పరిస్థితి మారిపోయిందని రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉన్నా, కేవలం జీజీహెచ్ తోనే సరిపెట్టారని, ఆయన వెంట భద్రతా సిబ్బంది లేరని, కుటుంబసభ్యులం తాము కూడా లేమని, ఇవాళ హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ జైలుకు తరలించారని అన్నారు. దీని వెనుక కుట్ర ఉందని భావిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే సీఎం జగన్, ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ బాధ్యత వహించాలని హెచ్చరించారు.

తన భర్తేమీ క్రిమినల్ కాదని, ఉగ్రవాది అంతకన్నా కాదని రమాదేవి స్పష్టం చేశారు. నేరాలు చేసినవారందరూ హాయిగా తిరుగుతున్నారని మండిపడ్డారు. తన భర్త రఘురామరాజును తాను ఇప్పుడు చూడాలనుకుంటున్నానని, ఆయన పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు.
Ramadevi
Raghu Rama Krishna Raju
Jail
Allegations
Jagan
APCID

More Telugu News