Raghu Rama Krishna Raju: రఘురామ వైద్య పరీక్షల నివేదికలో జాప్యం... కుటుంబ సభ్యుల ఆందోళన
- ఎంపీ రఘురామ కాలికి గాయాలు
- పోలీసులు కొట్టారంటున్న రఘురామ
- అవి ఎలా తగిలాయన్నదానిపై నిగ్గు తేల్చాలన్న కోర్టు
- గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
- ఆపై రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు
- నివేదిక రూపొందించనున్న మెడికల్ బోర్డు
ఎంపీ రఘురామకృష్ణరాజుకు కాలికి తగిలిన గాయాలపై గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నిరకాల పరీక్షలు చేయిస్తున్నారు. రఘురామ సొరియాసిస్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు. దాంతో డెర్మటాలజీ పరీక్షలు కూడా చేయిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలపై నివేదిక కోసం సీఐడీ కోర్టు ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మెడికల్ బోర్డుకు జీజీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వం వహిస్తున్నారు.
అయితే, ఈ మధ్యాహ్నం 12 గంటల లోపే రఘురామ వైద్యపరీక్షల నివేదిక ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటివరకు నివేదిక రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది అంటూ వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, జీజీహెచ్ లో వైద్య పరీక్షల అనంతరం, రమేశ్ ఆసుపత్రిలోనూ పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జీజీహెచ్ లోనే ఇంకా పరీక్షలు పూర్తికాకపోవడంతో, రమేశ్ ఆసుపత్రికి ఎప్పుడు తరలిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.