Revanth Reddy: పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా?: రేవంత్ రెడ్డి ఆగ్రహం
- లాక్ డౌన్ లో బయట కనిపించిన రేవంత్ రెడ్డి
- బేగంపేట వద్ద ఆపేసిన పోలీసులు
- పేదలకు పట్టెడన్నం పెట్టడం నేరమా అంటూ రేవంత్ ఆక్రోశం
- ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని విమర్శలు
లాక్ డౌన్ సమయంలో బయట తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని హైదరాబాదు బేగంపేట వద్ద పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు వెళుతుంటే తన వాహనాన్ని ఆపారని మండిపడ్డారు. ప్రభుత్వ అమానవీయ చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని అన్నారు. కంటోన్మెంట్ ఏరియాలో కొవిడ్ కేంద్రంగా మార్చిన ఓ ఆసుపత్రి వద్ద జరుగుతున్న పనులను కూడా తాను పర్యవేక్షించాల్సి ఉందని వివరించారు.
పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా? నన్ను ఆపడం అంటే గరీబోడి నోటికాడ కూడు లాగేసే ప్రయత్నమే అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గం అని విమర్శించారు.