Tauktae: తౌతే తుపాను ఎఫెక్ట్.. భారీ వర్షాలతో వణుకుతున్న కేరళ
- కేరళలో భారీ వర్షాలు, ఈదురు గాలులు
- తీర ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
- స్తంభించిన జనజీవనం
- రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
తౌతే తుపాను కేరళను అతలాకుతలం చేస్తోంది. అతి భారీ వర్షాలకు తోడు అత్యంత వేగంతో వీస్తున్న ఈదురు గాలులు భయపెడుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించింది. తుపాను కారణంగా తీర ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మల్లాపురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసర్‌గోడ్ జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూరు, పాలక్కాడ్ జిల్లాల్లోనూ దీని ప్రభావం కనిపించింది.
వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వృక్షాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీరప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరుగుతుండడంతో ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. కాసర్‌గోడ్ జిల్లాలోని చేరంగాయ్‌లో తుపాను దాటికి ఓ భవనం కుప్పకూలింది. అయితే, అందులో నివసించే కుటుంబాలను ముందుగానే ఖాళీ చేయించడంతో పెను ముప్పు తప్పింది.
తీవ్ర రూపం దాల్చిన తౌతే తుపాను గుజరాత్ వైపు పయనిస్తున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా మారి మంగళవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య గుజరాత్‌లోని పోర్‌బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ సమయంలో గంటలకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.