Raghu Rama Krishna Raju: రఘురామ పరిస్థితిపై ఎవరెవరు ఏమన్నారంటే...!
- కాళ్లకు గాయాలతో కనిపించిన రఘురామ
- సీఐడీ కోర్టుకు కుంటుతూ వచ్చిన వైనం
- పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణ
- రఘురామ పరిస్థితిపై విచారం వ్యక్తం చేసిన నేతలు
- పోలీసుల తీరుకు ఖండన
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును నిన్న హైదరాబాదులోని గచ్చీబౌలి నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను విజయవాడ తరలించిన సీఐడీ అధికారులు నేడు కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టుకు వచ్చిన సందర్భంగా రఘురామకృష్ణరాజు కుంటుతూ, సరిగా నడవలేని స్థితిలో కనిపించారు. తనను పోలీసులు దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని టీడీపీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు చేయాల్సిన పోలీసులు జగన్ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఒక ఎంపీని కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకే ఈ పరిస్థితి ఎదురైతే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, ప్రజలకు ఇంకెక్కడి రక్షణ? అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని విమర్శించారు.
ఏపీలో అరాచకపాలనపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్, గవర్నర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేంద్ర బృందాలతో న్యాయ విచారణ జరిపించాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా ఇదే తరహాలో స్పందించారు. జగన్ సీఐడీని కక్ష సాధింపు సంస్థగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఘోరమని అభిప్రాయపడ్డారు.
అటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ కూడా రఘురామ వ్యవహారంలో సీఐడీ తీరును ఖండించారు. రఘురామకృష్ణరాజును చిత్రహింసల పాల్జేయడాన్ని ఖండిస్తున్నట్టు పురందేశ్వరి తెలిపారు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారి పట్ల ఏపీ సీఎం అసహనాన్ని ఈ ఉదంతం వెల్లడిస్తోందని తెలిపారు. ఇది సంపూర్ణ ప్రజాస్వామ్య హననం అని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.
సునీల్ దేవధర్ కూడా ఏపీ సీఐడీ పోలీసుల తీరును తప్పుబట్టారు. ఇప్పటిదాకా ప్రజలు వైసీపీని ఓ రౌడీ పార్టీ అని భావించేవారని, ఇప్పుడు పోలీసులు కూడా ఓ రౌడీ వ్యవస్థను తలపిస్తున్నారని విమర్శించారు. మతమార్పిడి మాఫియాకు వ్యతిరేకంగా గళం విప్పినందుకు ఇది ప్రతీకార్య చర్యనా? అంటూ సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.