Andhra Pradesh: ఏపీలో ఏమాత్రం తగ్గని కొవిడ్ తీవ్రత... ఒక్కరోజులో 96 మంది మృత్యువాత
- రాష్ట్రంలో కరోనా మృత్యుఘంటికలు
- అనంతపురం జిల్లాలో 11 మంది మృతి
- గత 24 గంటల్లో 89,087 కరోనా టెస్టులు
- 22,018 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరి జిల్లాలో 3 వేలకు పైగా కొత్తకేసులు
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో మరింత తీవ్రరూపు దాల్చిన కొవిడ్ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. ఏపీలో ఒక్కరోజులోనే 96 మంది మరణించడంతో ఈ వైరస్ తీవ్రతను చాటుతోంది. అనంతపురం జిల్లాలో 11 మంది, తూర్పుగోదావరి, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 9,173కి పెరిగింది.
గత 24 గంటల్లో ఏపీలో 89,087 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,432 కొత్త కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లోనూ కరోనా బీభత్సం కనిపించింది. అదే సమయంలో 19,177 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 13,88,803 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 11,75,843 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,03,787 మంది చికిత్స పొందుతున్నారు.