Goa: స్టోర్ రూంలో కరోనా రోగులు.. గోవా ఆసుపత్రిలో దారుణం
- వరండా నేలపైనే మరికొందరు
- పట్టించుకునే నాథుడు కరవు
- ఆక్సిజన్ అందక మరో 15 మంది బలి
- బెడ్లు లేవు.. దాని మీద పరుపులూ లేవు
- కరోనా పాజిటివిటీ రేటు 51%
హాలిడే అంటే ముందు గుర్తొచ్చేది గోవానే. కానీ, ఆ గోవానే ఇప్పుడు కరోనాతో అల్లకల్లోలమైపోతోంది. కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆసుపత్రుల్లో బెడ్లు కూడా చాలని పరిస్థితి. ఆక్సిజన్ అందక ప్రాణాలు కొడిగట్టిపోతున్న దీన పరిస్థితులున్నాయక్కడ. గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోనైతే మరింత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
కనీసం పేషెంట్లకు సరిపడా బెడ్లు లేకపోవడంతో ఆసుపత్రి వరండాల్లోనే పేషెంట్లు పడుకుని చికిత్స కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. వారిని పట్టించుకునే వైద్యులు, సిబ్బందీ కరవే. మరికొందరు పేషెంట్లనైతే స్టోర్ రూంలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. మొన్నటికిమొన్న ఆక్సిజన్ అందక 26 మంది పేషెంట్లు చనిపోయిన ఘటన మరువకముందే.. గురువారం మరో 15 మంది మరణించారు.
మామూలుగా అయితే ఆసుపత్రుల్లోని కొవిడ్ వార్డుల్లోకి రోగి బంధువులను రానివ్వరని, కానీ, గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మాత్రం అన్నీ పేషెంట్ బంధువులే చూసుకోవాలని కరోనా పేషెంట్ బావమరిది హేమంత్ కాంబ్లీ చెప్పారు. అందుబాటులో ఉన్న కొన్ని బెడ్లపైన కనీసం పరుపులు కూడా లేవని ఆరోపించారు. ఆక్సిజన్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోయారు. అంత చేసినా తన బావను బతికించుకోలేకపోయానని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని గోవా ఫార్వర్డ్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ దుర్గాదాస్ కామత్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కొవిడ్ నోడల్ అధికారిపై కేసు పెట్టామన్నారు. ప్రస్తుతం గోవాలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 51 శాతంగా ఉంది. రికవరీ రేటు 71 శాతం మాత్రమే ఉంది.