MK Stalin: పిల్లవాడి పెద్దమనసుకు అచ్చెరువొందిన తమిళనాడు సీఎం
- తమిళనాడులో కరోనా బీభత్సం
- సైకిల్ కోసం దాచుకున్న డబ్బును విరాళంగా ఇచ్చిన చిన్నారి
- ఒక కరోనా రోగికి తన డబ్బుతో చికిత్స చేయాలని లేఖ
- ముగ్ధుడైన సీఎం స్టాలిన్
- చిన్నారికి కానుకగా సైకిల్
ఇటీవల తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్ ఓ పిల్లవాడి చర్యకు ఫిదా అయ్యారు. రాష్ట్రంలో కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్న తరుణంలో హరీశ్ వర్మన్ (7) అనే చిన్నారి తాను దాచుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చి పెద్దమనసు చాటుకున్నాడు. ఆ పిల్లవాడి దాతృత్వం పట్ల స్పందించిన సీఎం స్టాలిన్ కానుక ఇచ్చి ఆ బాలుడ్ని సంతోషానికి గురిచేశారు.
మధురైకి చెందిన హరీశ్ వర్మన్ ఓ సైకిల్ కొనుక్కోవాలని రెండేళ్లుగా తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు దాచుకుంటున్నాడు. హరీశ్ తండ్రి ఓ ఎలక్ట్రీషియన్. కాగా, రాష్ట్రంలో కరోనా కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులు ఆ బాలుడ్ని కదిలించాయి. ఈ నేపథ్యంలో, తాను దాచుకున్న డబ్బును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశాడు. తాను అందించిన సొమ్మును ఒక కరోనా రోగి చికిత్సకు ఖర్చు చేయాలని లేఖ రాశాడు.
ఈ లేఖ విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ ముగ్ధుడయ్యారు. ఆ బాలుడికి ఓ సైకిల్ ను కానుకగా పంపారు. అంతేకాదు, ఫోన్ చేసి ఆ చిన్నారితో మాట్లాడారు. సీఎం నుంచి ఊహించని విధంగా బహుమానం వచ్చేసరికి చిన్నారి హరీశ్ వర్మన్ ఆనందం అంతాఇంతా కాదు. ఇక అతడి తల్లిదండ్రులైతే, సీఎం అంతటివాడు తమతో మాట్లాడేసరికి ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.