Uttar Pradesh: యమునా నదిలో కరోనా బాధితుల శవాలు.. శ్మశానాలు చాలక పడేస్తున్న గ్రామస్థులు!

Dozens of bodies float in Yamuna in UP locals in Hamirpur panic fearing Covid

  • యూపీలోని హామీర్ పూర్ లో ఘటన
  • గ్రామాల్లో భారీగా కరోనా మరణాలు
  • అధికారులు పట్టించుకోవట్లేదన్న గ్రామస్థులు
  • చాలా మరణాలు లెక్కలోకి రావట్లేదని ఆందోళన

ఒకటి కాదు.. రెండు కాదు.. డజనుకుపైగా మృతదేహాలు యమునా నదిలో తేలియాడుతూ కనిపించాయి. స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై వారు పోలీసులకు సమాచారమిచ్చారు.

గ్రామంలో కరోనాతో చాలా మంది చనిపోతున్నారని, వారి అంత్యక్రియలకు శ్మశానం సరిపోవట్లేదని, దీంతో శవాలను ఇలా నదిలో పడేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక అధికారులు వచ్చి నదిలో ఉన్న శవాలను పరిశీలించారని, నదిలోనే వారి శవాలను డిస్పోజ్ చేయాలని నిర్ణయించారని అంటున్నారు.

ఇంకొన్ని గ్రామాల్లో యమునా నది ఒడ్డునే కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఆ మరణాలు లెక్కలోకి కూడా రావట్లేదు. ఇటు జిల్లా అధికారులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. హామీర్ పూర్ నుంచి కాన్పూర్ జిల్లాల వరకు రోజూ లెక్కకు మించిన మరణాలు నమోదవుతున్నాయని, కానీ, పట్టించుకునేవారు లేరని ఆయా జిల్లాల గ్రామస్థులు చెబుతున్నారు.

యమునా నది పవిత్రమైనదిగా స్థానికులు భావిస్తుంటారని, అందుకే నదిలో మృతదేహాలను ఖననం చేస్తుండవచ్చని హామీర్ పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ చెప్పారు. అప్పుడప్పుడు ఒకట్రెండు మృతదేహాలు నదిలో కనిపిస్తుంటాయని, కానీ, ఇప్పుడు ఏకంగా పదుల సంఖ్యలో మృతదేహాలు తేలియాడుతున్నాయని అన్నారు. కరోనా భయంతో శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకూ జనాలు ముందుకు రావట్లేదని, దీంతో నదిలో పడేస్తున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News