vaccine: ఏపీలో పలు జిల్లాల్లో నిలిచిన వ్యాక్సినేషన్.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో టీకాల కోసం బారులు
- కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరులో టీకాలు లేవు
- రెండో డోసు కోసం జనాల ఆందోళన
- హైదరాబాద్‌లో క్యూలైన్లలో బారులు తీరిన జనం
- కొందరికే టోకెన్లు
- ఉప్పల్, హఫీజ్‌పేట, నిజామాబాద్‌లో పరిస్థితి దారుణం
కరోనా టీకాల కోసం ప్రజలు భారీగా బుకింగ్ చేసుకుంటున్నారు. మొదట వ్యాక్సిన్ అంటేనే భయపడ్డ జనం ఇప్పుడు వాటి కోసం భారీగా వ్యాక్సిన్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడ్డ నేపథ్యంలో డిమాండుకు తగ్గ టీకాలను వేయలేకపోతున్నారు. ఏపీ, తెలంగాణలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీలోని పలు జిల్లాలో రెండు రోజులు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వారు ఆందోళన చెందుతున్నారు. ఎల్లుండి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రెండో డోస్ వారికి మాత్రమే వేస్తామని వైద్య సిబ్బంది అంటున్నారు.
కృష్ణా జిల్లాలోనూ రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేశారు. అయితే, గన్నవరంలో రెండో డోసు కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. తాము 20 రోజులుగా వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని, తమను పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాతో పాటు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోనూ టీకాలు వేయట్లేదు.
ఇక తెలంగాణలోని పలు ఆరోగ్య కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరి నిలబడ్డారు. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ కేంద్రం ముందు జనాలు ఈ రోజు ఉదయం నుంచి బారులుతీరి కనపడ్డారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్‌లోని వినాయక నగర్, పోలీస్ లైన్ ఆసుపత్రి వద్దకు జనాలు భారీగా వచ్చారు. కొంత మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చిన వైద్య సిబ్బంది మిగతా వారందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. ముఖ్యంగా కొవాగ్జిన్ రెండో డోసు దొరకడం గగనమైపోయింది. రెండో డోసు కోసం హైదరాబాద్‌లోని అమీర్ పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రజలు భారీగా చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు.
తమ ఆరోగ్య కేంద్రంలో 200 మందికి కొవిషీల్డ్, 150 మందికి కొవాగ్జిన్ అందుబాటులో ఉందని అక్కడి వైద్య సిబ్బంది చెప్పారు. హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట ఆరోగ్య కేంద్రం ముందు కూడా క్యూల్లో చాలా మంది నిలబడ్డారు. నిజామాబాద్‌లో కేవలం 2 కేంద్రాల్లో మాత్రమే అది అందుబాటులో ఉంది. దీంతో రెండో డోసు కోసం ఆయా కేంద్రాల్లో... మొదటి డోసు వేయించుకున్న వారు బారులు తీరారు. పలు జిల్లాల్లోనూ ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయి.