Vijayashanti: తెలంగాణలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా అయోమయంలో ఉంది: విజయశాంతి
- నైట్ కర్ఫ్యూ వల్ల ఫలితంలేదని వ్యాఖ్య
- పగటిపూట నియంత్రణలు కూడా ఏమీ లేవని విమర్శలు
- కోర్టు మందలిస్తోందన్న విజయశాంతి
- సీఎస్, సీఎం మాత్రం అంతా బాగుందంటున్నారని అసంతృప్తి
తెలంగాణలో కరోనా నియంత్రణ అంశంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ నేత విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉన్నట్టు స్పష్టమవుతోందని తెలిపారు. రాత్రి పూట కర్ఫ్యూ వల్ల ఫలితం లేదని తేలిపోయిందని, అటు పగటిపూట నియంత్రణలు కూడా ఏమీలేవని విమర్శించారు.
మరోవైపు కొన్ని పెద్ద రాష్ట్రాలు పరిస్థితిని అదుపు చేసేందుకు స్వల్ప కాల లాక్ డౌన్ విధించాయని, కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని సీఎం కేసీఆర్ సెలవిచ్చారని వివరించారు. అయితే, గతంలో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఇవ్వడం, పరిమితులతో వాణిజ్య, పారిశ్రామిక, ఉద్యోగ, కార్మిక కార్యకలాపాలు నడిచేలా పాస్ లు జారీ చేయడం వంటి చర్యలతో పరిస్థితిని కొంత అదుపు చేసిన సంగతి గుర్తులేదా? అని విజయశాంతి ప్రశ్నించారు.
ఇక, రాష్ట్రంలో కొవిడ్ చికిత్స తీరు, టెస్టుల నిర్వహణ, పడకలు, ఔషధాలు, వ్యాక్సిన్ లభ్యతపై దాదాపు ప్రతిరోజూ అధికారులను కోర్టు మందలిస్తోందని, మీడియా కథనాలు వాస్తవాలను చూపిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, సీఎస్, సీఎం మాత్రం రాష్ట్రంలో అంతా బాగుందని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
"ఒకరోజు అన్నీ సవ్యంగా ఉన్నాయని అంటారు... మరొక రోజు కేంద్రంపై నిందలేస్తారు. కరోనా పరిస్థితులను కట్టడి చేయలేని ఈ తెలంగాణ పాలకుల తీరుపై ఏంచేయాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు" అని విజయశాంతి వ్యాఖ్యానించారు.