Lockdown: కేరళలో సంపూర్ణ లాక్ డౌన్... ఈ నెల 8 నుంచి అమలు
- కేరళలో కరోనా విలయం
- నిన్న ఒక్కరోజే 41 వేలకు పైగా కొత్త కేసులు
- ఈ నెల 16 వరకు లాక్ డౌన్ అమలు
- కఠిన నిర్ణయం తప్పలేదన్న సీఎం పినరయి విజయన్
కేరళలో కరోనా భూతం విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. కేరళలో నిన్న ఒక్కరోజే 41,953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
దీనిపై సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ, సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఏమాత్రం తగ్గడంలేదని వెల్లడించారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ తప్పట్లేదని స్పష్టం చేశారు. సీఎం పినరయి విజయన్ నిన్ననే లాక్ డౌన్ పై సంకేతాలు ఇచ్చారు. కరోనా భూతం విపరీతమైన వేగంతో వ్యాపిస్తోందని, రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.