TMC: పశ్చిమ బెంగాల్‌లో శాంతిని నెలకొల్పే బాధ్యత టీఎంసీ కార్యకర్తలదే: శివసేన
- మమత రాజీనామా తర్వాత శాంతిభద్రతలు కేంద్ర బలగాల చేతుల్లోకి వెళ్లాయి
- ఓట్లు అడిగిన ప్రధాని మోదీ, అమిత్ షా శాంతికి పిలుపునివ్వాలి
- టీఎంసీ గెలిచింది కాబట్టి ఆ బాధ్యత దానిదే
పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం తర్వాత చెలరేగిన హింసపై శివసేన స్పందించింది. మమత బెనర్జీ రాజీనామా తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు కేంద్ర పోలీస్ బలగాల చేతుల్లోకి వెళ్లాయని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అయితే, రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత మాత్రం టీఎంసీ కార్యకర్తలపైనే ఉందన్నారు. బెంగాల్‌లో శాంతికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా పిలుపునివ్వాలని అన్నారు.
నిన్న ముంబైలో మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. రాష్ట్రంలో టీఎంసీ గెలిచింది కాబట్టి శాంతిని తిరిగి స్థాపించే బాధ్యత కూడా ఆ పార్టీదేనని అన్నారు. ప్రజలను శాంతింపజేసే పనిని వారే చేపట్టాలని అన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వారిని బుజ్జగించి తిరిగి ప్రశాంతతను తీసుకురావాలని టీఎంసీని కోరారు.
బెంగాల్‌లో విధ్వంసాన్ని మమత బెనర్జీ ఆపాలన్న బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ వ్యాఖ్యలపై స్పందించిన రౌత్.. రాష్ట్రంలో విధ్వంసం జరిగిన మాట వాస్తవమని, మరి శాంతి కోసం ఎవరు పిలుపునివ్వాలని ప్రశ్నించారు. బెంగాల్‌లో ఓట్లు అడిగిన ప్రధాని, హోంమంత్రి, జేపీనడ్డా లాంటి వారు శాంతి కోసం పిలుపునివ్వాలని సంజయ్ రౌత్ అన్నారు.