Corona Virus: భారత్‌కు ఆస్ట్రేలియన్ బౌలర్ జేసన్ బెహ్రెండార్ఫ్ విరాళం!
- భారత్‌లో కరోనా విలయతాండవం
- చలించిపోతున్న క్రికెటర్లు
- ఇప్పటికే విరాళాలు ప్రకటించిన పలువురు ఆటగాళ్లు
- తాజాగా ఆస్ట్రేలియన్ బౌలర్ బెహ్రెండార్ఫ్ సాయం
- భారత్‌పై తన ప్రేమను చాటుకున్న క్రికెటర్
భారత్ పడుతున్న కరోనా కష్టాలను చూసి చలించిపోతున్న పలువురు క్రికెటర్లు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఐపీఎల్‌లో పాల్గొంటున్న పలువురు ఆటగాళ్లు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్, బ్రెట్ లీ సహా సచిన్, ధావన్, రహానే, పాండ్యాతో పాటు మరికొంత మంది ఆటగాళ్లు తమ వంతుగా సాయం ప్రకటించారు. అలాగే రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాలు సైతం విరాళాలు ప్రకటించాయి.
తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ జేసన్ బెహ్రెండార్ఫ్ భారత్‌కు యూనిసెఫ్ ద్వారా సాయాన్ని ప్రకటించారు. ‘‘చాలా మంది క్రికెటర్ల లాగే నాకూ భారత్ అంటే అభిమానం. భారత్ చాలా అద్భుతమై దేశం. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను ఆస్వాదించే తీరును ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేం. ప్రస్తుతం ఇక్కడి భయానక పరిస్థితులు చూసి నాకు తీవ్ర ఆవేదన కలుగుతోంది. నేను పెద్దగా ఏమీ చేయలేనని తెలిసి చింతిస్తున్నాను.
నా ఆలోచనలన్నీ వైరస్‌తో బాధపడుతున్న వారి చుట్టూనే తిరుగుతున్నాయి. మీరు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో నేను ఊహించుకోలేకపోతున్నా. ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో యూనిసెఫ్ ప్రాజెక్టు ద్వారా కొంత విరాళం అందిస్తున్నా. భారత్ ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రతిఒక్కరూ సాయం చేయాలని కోరుతున్నా’’ అని జేసన్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. అయితే, తాను ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నానన్న విషయం మాత్రం బయటకు వెల్లడించలేదు.