Australia: భారత్ నుంచి ప్రయాణికులపై విధించిన నిషేధాన్ని సమర్థించుకున్న ఆస్ట్రేలియా
- నిబంధనలు ఉల్లంఘించి దేశంలోకి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష
- నేటి నుంచే అమలు
- మండిపడిన ప్రతిపక్షాలు
- దేశప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నామన్న ప్రధాని మారిసన్
భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించడాన్ని ఆస్ట్రేలియా సమర్థించుకుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ఆంక్షలు ఉల్లంఘించి ఎవరైనా దేశంలో అడుగుపెడితే ఐదేళ్ల జైలు శిక్ష, 66 వేల ఆస్ట్రేలియా డాలర్ల (రూ. 38 లక్షలు) జరిమానా విధించనున్నట్టు ఇటీవల స్కాట్ మారిసన్ ప్రకటించారు. నేటి నుంచే ఇది అమల్లోకి రాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన మారిసన్ నిషేధాన్ని సమర్థించుకున్నారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భారత్‌లో నెలకొన్న కొవిడ్ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని... దేశంలో మూడో దశ వ్యాప్తి ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. గతేడాది నుంచి దేశంలో బయో సెక్యూరిటీ చట్టం అమల్లో ఉందని, అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరినీ జైలుకు పంపలేదన్నారు.