Somireddy Chandra Mohan Reddy: తిరుపతిలో నైతిక విజయం మాదే... వైసీపీది గెలుపు కాదు వాపు: సోమిరెడ్డి

Somireddy responds on Tirupati by polls result

  • తిరుపతి లోక్ సభ స్థానంలో వైసీపీ గెలుపు
  • అక్రమాలతో గెలిచారన్న సోమిరెడ్డి
  • దొంగ ఓట్లు వేయించారని ఆరోపణ
  • పెద్ద ఘనవిజయంలా చెప్పుకుంటున్నారని ఎద్దేవా

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజారిటీతో నెగ్గిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. తిరుపతి ఎన్నికల్లో నైతిక విజయం టీడీపీదేనని అన్నారు. తిరుపతిలో వైసీపీకి చావుతప్పి కన్ను లొట్టబోయినంత పనైందని వ్యాఖ్యానించారు.

5 లక్షల మెజారిటీ సాధిస్తామని, టీడీపీ చాప చుట్టేసుకోవాల్సిందేనని, టీడీపీకి డిపాజిట్లు కూడా రావని వైసీపీ నేతలు ప్రచారం చేశారని వెల్లడించారు. కానీ 2.70 లక్షల మెజారిటీతో మాత్రమే గెలిచారని, పైగా దొంగ ఓట్లతో గెలిచిన దానికి అదో పెద్ద ఘనవిజయం అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నైతికంగా గెలిచిందని తాము భావిస్తున్నామని, వైసీపీది నేరాలు ఘోరాలతో సాధించుకున్న విజయం అని విమర్శించారు. "దేశం మొత్తం తిరుపతి వైపు చూడాలని జగన్ రెడ్డి చెప్పారు... దాంతో  బస్సుల్లో జనాన్ని తీసుకువచ్చి ఓట్లేయించారు. దౌర్జన్యాలకు పాల్పడి ఓట్లేయించుకున్నారు. దొంగ ఓట్లతో గెలిచింది మీరు. ఈ మాట బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కూడా చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కూడా ఇదే చెప్పారు. ఎన్ని దొంగ ఓట్లు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అక్రమాలు... అన్నీ బహిరంగంగా చేసి ఎన్నికల్లో గెలిచారు. ఇది వైసీపీ గెలుపు బలుపు కాదు... అక్రమాలతో వచ్చిన వాపు మాత్రమే" అని సోమిరెడ్డి వివరించారు.

Somireddy Chandra Mohan Reddy
Tirupati LS Bypolls
Gurumurthy
YSRCP
TDP
Tirupati
Andhra Pradesh
  • Loading...

More Telugu News