Trunamool Congress: తృణమూల్ కు అన్నీ తానై విజయం దిశగా నడిపించిన అభిషేక్ బెనర్జీ!
- మోదీ, అమిత్ షాలకు దీటుగా ప్రచారం
- మమతకు గాయం కాగానే ప్రచార బాధ్యతలు మోసిన అభిషేక్
- టీఎంసీ గెలుపు వెనుక కీలక పాత్ర
అభిషేక్ బెనర్జీ... మమతా బెనర్జీ మేనల్లుడు. మేనల్లుడిని బెంగాలీ భాషలో 'భైపో' అంటారు. ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా ఇదే పేరు వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎలాగైనా బెంగాల్ లో పాగా వేయాలని సర్వశక్తులూ ఒడ్డి పోరాడినా, నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నేతలు విస్తృతంగా పర్యటనలు జరిపి ప్రచారం చేసినా, విజయం మాత్రం దక్కలేదు. టీఎంసీ గెలుపు వెనుక అభిషేక్ బెనర్జీదే కీలక పాత్రని చెప్పడంలో సందేహం లేదు.
అభ్యర్థుల ఎంపిక, ప్రచారానికి రోడ్ షో సిద్ధం చేయడం నుంచి ఎన్నికల 8 విడతల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అభిషేక్ తన అత్త మమతా బెనర్జీ వెన్నంటి నిలిచారు. మోదీ, అమిత్ షా వంటి వారు సైతం తమ ప్రచారంలో అభిషేక్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారంటే, తృణమూల్ కాంగ్రెస్ లో ఆయన పరపతి, శక్తి సామర్థ్యాలను ఊహించుకోవచ్చు.
ఇక, ఎన్నికలకు ముందు తృణమూల్ ను వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారితో పాటు వైశాలీ దాల్మియా, రాజీవ్ బందోపాధ్యాయ వంటి వారు, తాము అభిషేక్ వల్లనే పార్టీని వీడుతున్నామని స్పష్టం చేశారు. దీంతో తృణమూల్ లోని కొందరు నేతల్లో ఆయన పెత్తనంపై అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయని వార్తలు వచ్చాయి.
వీటిని అటు మమత, ఇటు అభిషేక్ ఏ మాత్రమూ పట్టించుకోలేదు. తన మేనల్లుడిపై పూర్తి విశ్వాసం ఉంచిన మమత ఆయనకే ప్రచార బాధ్యతల్లో పెద్దపీట వేశారు. ఇక, మమతా బెనర్జీ కాలికి గాయం కాగానే, అన్నీ తానై ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారు. మమతా బెనర్జీ రోడ్ షోలు రద్దయిన ప్రాంతాల్లో ప్రత్యేక సభలు పెట్టి ఓటర్లకు పార్టీని చేరువ చేశారు.