Election commission: మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు మమల్ని అవమానించేలా ఉన్నాయి.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఈసీ
- కొవిడ్ ఉద్ధృతిలో ఎన్నికలు నిర్వహించడంపై హైకోర్టు ఆగ్రహం
- ఎన్నికల సంఘంపై ఘాటు విమర్శలు
- హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయాలని వ్యాఖ్య
- కోర్టు వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో పోలింగ్ నిర్వహించడంపై ఎన్నికల సంఘం(ఈసీ)పై ఇటీవల మద్రాస్ హైకోర్టు పదునైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఓ రాజ్యాంగబద్ద, స్వతంత్ర సంస్థ అయిన హైకోర్టు మరో రాజ్యాంగబద్ధ, స్వతంత్ర సంస్థపై ఈ తరహాలో హత్యాభియోగాల వంటి తీవ్ర ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొంది. దీని వల్ల ఇరు సంస్థల ప్రతిష్ఠ దెబ్బతిందని వ్యాఖ్యానించింది.
కొవిడ్-19 విజృంభణకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈసీయే కారణమని ఏప్రిల్ 26న జరిగిన విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితులకు ఆ సంస్థదే బాధ్యతని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వీటిని అవమానంగా భావించిన ఎన్నికల సంఘం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.