Nirav Modi: భారత్ కు అప్పగించకుండా బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్
- జిల్లా కోర్టు జడ్జి, బ్రిటన్ హోం మంత్రి ఆదేశాలపై అప్పీల్
- వాటిని రద్దు చేయాలని కోరిన వజ్రాల వ్యాపారి
- పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.10 వేల కోట్లు ఎగవేత
- భారత్ నుంచి బ్రిటన్ కు పారిపోయిన నీరవ్
- అక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు
భారత్ కు తనను అప్పగించే విషయంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బ్రిటన్ హైకోర్టుకు వెళ్లారు. తన ఎక్స్ ట్రాడిషన్ ను నిలిపేయాలని పిటిషన్ వేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.10 వేల కోట్లు ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన సంగతి తెలిసిందే. 2019 మార్చి 19లో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో నిర్బంధించారు. భారత్ అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 15న భారత్ కు అతడిని అప్పగించాలని బ్రిటన్ హోం శాఖ మంత్రి ప్రీతి పటేల్ ఆదేశాలిచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఆ ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ నీరవ్ మోదీ ఏప్రిల్ 28న పిటిషన్ వేశారని హైకోర్టులోని అడ్మినిస్ట్రేటివ్ కోర్టు వెల్లడించింది. ఫిబ్రవరి 25న జిల్లా కోర్టు జడ్జి సామ్ గూజ్, ఏప్రిల్ 15న హోం మంత్రి ప్రీతీ పటేల్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ముందుగా దీనిపై సింగిల్ జడ్జి నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.
ఆ విచారణకు మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. అయితే, ఒకవేళ నీరవ్ మోదీ పిటిషన్ ను జడ్జి వ్యతిరేకిస్తే.. దానిపైనా నీరవ్ మోదీ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్ కు నీరవ్ మోదీ అప్పగింత మరికొన్ని నెలలు పట్టే అవకాశం లేకపోలేదు.