Edappadi Palaniswami: అన్నాడీఎంకే ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వేళ.. పార్టీ నేతలు, కార్యకర్తలకు ఈపీఎస్, ఓపీఎస్ కీలక సూచనలు
- ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దు
- నకిలీ ఎగ్జిట్ పోల్స్ కు భయపడం
- ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే బయటకు రావాలి
- అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి
ఇటీవలే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈసారి అధికార అన్నాడీఎంకే ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మకూడదని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.
అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఇలాంటి నకిలీ ఎగ్జిట్ పోల్స్ కు భయపడదని చెప్పుకొచ్చారు. తమ పార్టీ, మిత్రపక్షాలు నియమించిన చీఫ్ ఏజెంట్లు, కౌంటింగ్ కేంద్రాల ఏజెంట్లు ఫలితాల రోజున తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలని వారు సూచించారు.
పోలింగ్ రోజున తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించాలని కోరారు. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, చీఫ్ ఏజెంట్లు 2వ తేదీ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే బయటకు రావాలని వారు చెప్పడం గమనార్హం.