Rohit sardana: కరోనాతో పోరాడుతూ ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ సర్దానా మృతి.. విచారం వ్యక్తం చేసిన ప్రధాని!
- జీ న్యూస్‌తో జర్నలిజం వృత్తిలోకి
- ఆజ్ తక్‌లో దంగల్ షోతో ఆదరణ
- 2018లో గణేశ్ శంకర్ విద్యార్థి పురస్కారం
- విచారం వ్యక్తం చేసిన పలు రంగాల ప్రముఖులు
ప్రముఖ జర్నలిస్టు రోహిత్ సర్దానా కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత జీ న్యూస్‌లో పనిచేసిన రోహిత్ అనంతరం ఆజ్ తక్‌లో చేరారు. దంగల్ అనే ప్రత్యేక చర్చా కార్యక్రమం ద్వారా వీక్షకులకు దగ్గరయ్యారు. 2018లో ఆయనను ప్రభుత్వం గణేశ్ శంకర్ విద్యార్థి పురస్కారంతో సత్కరించింది.
రోహిత్ సర్దానా మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత పురోగతిపై ఎంతో మక్కువ కలిగిన వ్యక్తిగా రోహిత్‌ను అభివర్ణించిన ప్రధాని మోదీ ఆయన లేని లోటు మీడియా వర్గాల్లో శూన్యాన్ని మిగిల్చిందన్నారు. రోహిత్ త్వరగా మనందరిని విడిచి వెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అమిత్ షా సైతం రోహిత్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. నిష్పాక్షిక జర్నలిజం కోసం గట్టిగా నిలబడ్డారన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు రోహిత్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.